కొత్తగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో తన ఇబ్బందులను తెలిపేందుకు ఓ రైతు ఏకంగా విద్యుత్తు కేంద్రానికే మిక్సీని తీసుకెళ్లి మసాలాలు పట్టుకుంటున్నాడు. ఇలా ఒక రోజు కాదు.. ఆరు నెలలుగా ఇలాగే చేస్తున్నా అధికారులు స్పందించటం లేదు. ఈ సంఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది. మెస్కామ్(మంగళూర్ విద్యుత్తు సరఫరా కంపెనీ లిమిటెడ్) అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు భద్రావతి తాలూకాలోని మంగూట్ గ్రామానికి చెందిన రైతు హనుమంతప్ప.
ఇదీ జరిగింది:మంగూట్ గ్రామంలో హనుమంతప్ప కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని అనావేరిలోని మెస్కామ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్తు కనెక్షన్‌కు డబ్బులు సైతం డిమాండ్ చేశారు. దానికి హనుమంతప్ప ఒప్పకోకపోవటం వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. వ్యవసాయ మోటార్ల కనెక్షన్(ఐపీ) కాకుండా గృహ వినియోగదారుల కనెక్షన్ ఇవ్వాలని కోరినప్పటికీ.. ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు.
ఇంట్లో వంట చేసేందుకు ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలపగా.. తమ కార్యాలయానికి వచ్చి వంటకు కావాల్సిన మసాలలు, ఇతర సామగ్రిని గ్రైండింగ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో ప్రతి రోజు మిక్సీతో మెస్కామ్ ఆఫీసుకు వెళ్లి గ్రైండింగ్ చేసుకుని వస్తున్నారు. హనుమంతప్పకు తల్లి, ఓ సోదరి, భార్యాపిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం వారి ఇంటికి సాధారణ విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామానికి 24/7 నిరంతర జ్యోతి పథకం కింద కొత్త కనెక్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో హనుమంతప్ప ఇంటికి ఉన్న విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. కొత్త కనెక్షన్ ఇవ్వలేదు.