ఓనమాలు నేర్పించి తమ జీవితాలను తీర్చిదిద్దిన మాస్టారుతో గురుపూజోత్సవం రోజు సరదాగా గడిపారు తమిళనాడు మధురైలోని ఓ పాఠశాల పూర్వ విద్యార్థులు. 40 ఏళ్లుగా పాఠాలు చెబుతున్న తమ ప్రియతమ ఉపాధ్యాయునికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఆయనకు బెత్తం ఇచ్చి ఓసారి కొట్టమని బతిమిలాడారు. విద్యార్థుల విజ్ఞప్తిని మన్నించి మాస్టారు కూడా సరదాగా చేతిపై తలో దెబ్బ కొట్టారు. దీంతో చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని అందరూ ఆనందంలో మునిగిపోయారు.
మధురై సెల్లూర్లోని మనోహర మిడిల్ స్కూల్లోనే వీరంతా చదువుకున్నారు. ఈ ప్రభుత్వ అనుంబంధ పాఠశాలలో పాల్ జయశంకర్ అనే ఉపాధ్యాయుడు 40 ఏళ్లుగా బోధిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే దీనికి హెడ్మాస్టర్. గురుపూజోత్సవం రోజు కలిసిన పూర్వ విద్యార్థుల ఆప్యాయత చూసి ఆయన మురిసిపోయారు. ఇన్నేళ్ల తర్వాత పిల్లలు మళ్లీ కలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు కొడితే నొప్పిగా ఉండేదని, కానీ క్రమశిక్షణగా ఉండాలని వారు కఠినంగా వ్యవహరించడం వల్లే తాము బాగా చదువుకొని జీవితంలో స్థిరపడినట్లు ఓ పూర్వ విద్యార్థి తెలిపాడు.