రాజకీయ నాయకుల కారణంగా రైల్వే శాఖలో ఉద్యోగాన్ని కోల్పోయింది ఓ మహిళ. ఆగ్రా రైల్వే డివిజన్లో హెల్పర్ ఉద్యోగం చేస్తున్న ఆమె.. ఆఫీస్‌లో ఉద్యోగం కావాలంటూ ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో చేసిన ప్రయత్నాలను అధికారులు తోసిపుచ్చారు. ఆమె రైల్వే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించించారంటూ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. దీంతో తక్షణమే ఉద్యోగంలో పూజా కుమారి అనే రైల్వే ఉద్యోగినిని తొలగిస్తున్నట్లు ఆగ్రా డివిజనల్ రైల్వే పీఆర్వో ప్రశస్తి శ్రీవాత్సవ ప్రకటించారు.
ఆగ్రా రైల్వే డివిజన్లో హెల్పర్‌గా గత పదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నారు పూజా కుమారి అనే మహిళ. ప్రస్తుతం తాను చేస్తున్న ఉద్యోగం కష్టంగా ఉందంటూ.. తనను ఆఫీస్ విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు ఉన్నత అధికారులకు పూజా దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అలా చేయలేమంటూ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. దీంతో పూజా మరో అడుగు ముందుకేసి.. తనకు పరిచయస్థులైన రాజకీయ నాయకుల ద్వారా రైల్వే అధికారులకు ఫోన్ చేసింది. ఆఫీసు విధుల్లోకి తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. రైల్వే సర్వీస్ రూల్స్ ప్రకారం.. ఏ ఉద్యోగి అయినా తమ సర్వీసు విషయంలోగానీ, ప్రమోషన్ విషయంలోగానీ ఎటువంటి రాజకీయ ఇతర పలుకుబడి ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు. రైల్వే సర్వీస్ క్రమశిక్షణ ఉల్లఘింగించినందుకు (రైల్వే యాక్ట్ 1968 కింద) పూజా కుమారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.