బంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. భాజపాయేతర పార్టీల్లో ఆమె హవా పెరిగింది. ఆమెను యూపీఏ కూటమి ఛైర్‌పర్సన్‌గా గానీ కన్వీనర్‌గా గానీ ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన వల్లే లౌకిక పార్టీలు ఓటమి పాలవుతున్నాయని భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు కొంతకాలంగా విమర్శలు చేస్తున్నాయి. గత ఏడాది నవంబరులో బిహార్ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి.. ఎన్‌డీఏ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సీట్ల సర్దుబాటు సమయంలో బలానికి మించి స్థానాలను కాంగ్రెస్ డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని ఆర్జేడీ అప్పట్లో ఆరోపించింది. "70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. 19 చోట్ల మాత్రమే గెలిచింది. 51 స్థానాల్లో ఆ పార్టీ ఓటమి.. ఎన్‌డీఏ విజయానికి దోహదపడింది" అని పేర్కొంది.
కాంగ్రెస్ పాత్ర పరిమితం కావాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా చెబుతున్నారు. మార్చి 16న కాంగ్రెస్ సీనియర్ నేత పి.సి.చాకోను తమ పార్టీలో చేర్చుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తృతీయ ఫ్రంట్ కోసం భాజపాయేతర పార్టీల్లో సెంటిమెంట్ పెరుగుతోందన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీలు అధికార కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తృతీయ కూటమి ఆలోచన వల్ల జాతీయ రాజకీయాల్లో తన పాత్ర మరింత దిగజారుతుందని భావించిన కాంగ్రెస్.. ఆ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తోంది.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌కు మళ్లీ నిరాశే- ఇలా ఇంకెంత కాలం?
ఇదీ చదవండి:'కాంగ్రెస్ వైఫల్యంపై సమీక్ష జరపాలి'
మారిన వైఖరి..
అయితే ఈ నెల 2న పశ్చిమ బంగాల్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వైఖరిలో మార్పు వచ్చింది. బంగాల్లో కొద్దోగొప్పో మిగిలిన కాంగ్రెస్ ఓట్లను ఈ ఎన్నికల్లో తృణమూల్ ఊడ్చేసింది. జనం నాడిని పట్టుకోవడంలో రాహుల్ గాంధీ తరచూ విఫలమవుతున్నారని సోనియా గాంధీ కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోనియా-రాహుల్ పనితీరుపై ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్‌లోని ఒక బృందం తీరు ఇప్పుడు మారింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలు పేలవంగా ఉన్నప్పటికీ రాహుల్‌పై తమ వ్యతిరేకతను వారు సడలించుకున్నారు. "కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తిరిగి ఎన్నిక కావాలని సోనియా ఇప్పటికీ భావిస్తుంటే.. ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్ పదవిని వదులుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పదవిని కాంగ్రెసేతర పార్టీ నేతకు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఆ హోదాను వదులుకోవడం సోనియాకు ఇష్టం లేకపోతే కనీసం సదరు నేతను కూటమి కన్వీనర్‌గా ఎంపిక చేయాలని అడుగుతున్నారు" అని పార్టీ నేత ఒకరు చెప్పారు.
ఇవీ చదవండి:పోరాటాలే మమత విజయానికి బాటలు
యూపీఏ పగ్గాలు శరద్ పవార్ చేపట్టాలని గతంలో భాజపాయేతర పార్టీలు కోరుకునేవి. అయితే కాంగ్రెస్‌కు అది ఇష్టంలేదు. కానీ బంగాల్‌లో తాజా విజయం తర్వాత మమత హవా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఛైర్‌పర్సన్‌గా కానీ, కన్వీనర్ హోదాలో కానీ యూపీఏను నడిపించేందుకు అత్యంత సమర్థురాలైన నేతగా ఆమె గుర్తింపు పొందారు. భాజపాయేతర పార్టీలైన డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లతో మమతకు మంచి సంబంధాలు ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తారని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. విపక్షాల ఐక్యత చాలా అవసరమని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.
ఇవీ చదవండి:మాటల ఫిరంగి.. గెలుపుల సివంగి.. దీదీ
జాతీయ ప్రత్యామ్నాయ నేత దీదీయేనా?