దీపావళి అంటేనే మిరిమిట్లు గొలిపే దీపాలతో పాటు మతాబులు, టపాసుల మోతలు. దేశంలోని ప్రధాన నగరాల్లో దీపావళి రోజున టపాకాయల మోతలు మారుమోగుతాయి. అయితే.. ప్రపంచంలోనే అత్యధిక శబ్ద కాలుష్య నగరాల్లో ఒకటైన ముంబయి మహానగరంలో ఈ దీపావళికి 15 ఏళ్లలోనే అత్యల్ప శబ్ద కాలుష్యం నమోదైనట్లు ఓ ఎన్జీఓ తెలిపింది. ఫైర్‌క్రాకర్స్ కాల్చటంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రజల్లో అవగాహన కల్పించటంతోనే ఇది సాధ్యమైనట్లు ఆవాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సమయ్రా అబ్దులాలి తెలిపారు.
"ఈ ఏడాది దీపావళి సందర్భంగా నమోదైన శబ్ద కాలుష్యం గడిచిన 15 ఏళ్లలోనే అత్యల్పం. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వని స్థాయులను నమోదు చేశాం. ఆ తర్వాత ఆదివారం ఉదయం వరకు కొనసాగించాం. శివాజీ పార్క్ వద్ద రాత్రి 10 గంటలకు ముందు 105.5 డెసిబుల్స్ శబ్దాలు నమోదయ్యాయి. బొంబాయి హైకోర్టు 2010లో శివాజీ పార్క్‌ను ధ్వని రహిత ప్రదేశంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఈ మేరకు శబ్ద కాలుష్యం నమోదైంది. ముంబయిలో ఇప్పటి వరకు గరిష్ఠంగా 2019లో 112.3 డీబీ, 2018లో 114.1డీబీ, 2017లో 117.8 డీబీ గణాంకాలు నమోదయ్యాయి. ఈసారి శివాజీ పార్క్ వద్దకు చేరుకున్న చాలా మంది మాస్క్‌లు లేకుండానే వచ్చారు."