తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధం, 15 సెకన్లలోనే స్మాష్

నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్ల పొడవైన జంటటవర్ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన జంట టవర్లను పేల్చివేత టెక్నిక్‌ ద్వారా కూల్చివేయటం ఇదే మొదటిసారి. అయితే ఈ జంట టవర్ల చుట్టుపక్కల ఉంటున్న నివాస సముదాయాల వారిలో ఒకింత సంతోషం,మరొకింత ఆందోళన కనిపిస్తోంది

twin towers
ట్విన్‌ టవర్స్‌

By

Published : Aug 24, 2022, 10:49 PM IST

NOIDA TWIN TOWERS: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఈనెల 28న కూల్చివేసేందుకు సర్వం సిద్ధమైంది. ఆరోజు డ్రోన్లు ఎగురకుండా ట్విన్‌ టవర్స్‌ పరిధిలో ఎక్స్‌క్లూజివ్ జోన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దిల్లీలోని కుతుబ్‌ మినార్ కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఈ ట్విన్‌ టవర్స్‌.. 100 మీటర్ల పొడవైన 40 అంతస్తులు ఆదివారం మధ్యాహ్నం నేలమట్టం కానున్నాయి. టవర్స్‌కు ముందువైపు 450 మీటర్లు, మిగిలిన వైపుల 250 మీటర్లు.. ఎక్స్‌క్లూజివ్ జోన్‌ ఏర్పాటు చేశారు.

నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వేపైనా ఆదివారం మధ్యాహ్నం 2.15 నిమిషాల నుంచి అరగంటపాటు వాహనాలను నిలిపివేయనున్నారు. వీటిని కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. కేవలం 15 సెకన్లలోనే ట్విన్‌ టవర్స్ పేకమేడల్లా కూలిపోనున్నాయి. నోయిడాలోని సెక్టార్‌ 93-Aలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు తేలడంతో.. సుప్రీంకోర్టు వాటిని కూల్చివేయాలని ఆదేశించింది.

ఎమరాల్డ్‌ కోర్టు చుట్టుపక్కల దాదాపు 5వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ జంట టవర్ల కూల్చివేతతో.. ఆ చుట్టుపక్కల ఉంటున్న నివాస సముదాయాలవారికి భారీ టవర్ల వల్ల పడే నీడ నుంచి ఊరట లభించనుంది. కూల్చివేత గడువు దగ్గర పడుతుండటంతో.. అక్కడి ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే కూల్చివేత బాధ కంటే సంతోషమే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే అత్యంత ఎత్తైన జంట టవర్లను పేల్చివేత టెక్నిక్‌ ద్వారా కూల్చివేయటం ఇదే మొదటిసారి. ఈ కూల్చివేత ద్వారా 55 వేల టన్నుల శిథిలాలు పోగుపడనున్నాయి.

కూల్చివేత సందర్భంగా ఎమరాల్డ్‌ కోర్టు, ATS విలేజ్‌ సెక్టార్‌ 93Aలోని నివాసం ఉంటున్నవారిని..ఆరోజు ఉదయం ఏడుకల్లా ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. అధికారుల నుంచి భద్రతా క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత సాయంత్రం 4గంటలకు తిరిగి తమ నివాసాలకు చేరుకునేందుకు అనుమతించనున్నారు. ఈ జంట టవర్ల కూల్చివేత ద్వారా ఏర్పడే దుమ్ము, ధూళి కారణంగా ఆ తర్వాత వారంరోజుల నుంచి 90 రోజుల వరకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు అప్రమత్తం చేశారు. మాస్క్‌లు, కళ్లద్దాలు, అవసరమైతే తప్ప బయటికి రావద్దని స్థానికులకు సూచించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details