తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. భారత సైనికుల ధైర్య సాహసాలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసిందని ఆరోపించిన రాజ్‌నాథ్.. చైనాతో 9 విడతల సుదీర్ఘ చర్చల అనంతరం ఇది సాధ్యమైందని తెలిపారు.
సరిహద్దులపై తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను దేశం ఎప్పటికీ అనుమతించదని.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. తమిళనాడులో నిర్వహించిన భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
''9 విడతల దౌత్య, ఉన్నత స్థాయి సైనిక చర్చల అనంతరం ఇది సాధ్యమైంది. కానీ దురదృష్టవశాత్తు భారత సైనికుల ధైర్యాన్ని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అత్యున్నత త్యాగం చేసే సైనికులను అవమానించడం తగదు.''
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాజ్‌నాథ్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను భాజపా ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వానికి ఆమె సహృదయంతో మద్దతు తెలిపారని గుర్తుచేశారు. జయలలితను తమిళనాడు ముద్దుబిడ్డ, పురుచ్చి తలైవీ అంటూ తన ప్రసంగంలో రాజ్‌నాథ్ ఉటంకించారు.