భారత్‌కు చెందిన 'ఆల్ట్‌న్యూస్' వ్యవస్థాపకులు మహ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హా నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచారు. మానవాళికి ప్రయోజనం కోసం పనిచేసేవారికి ఈ శాంతి బహుమతిని ఇస్తారు. ప్రస్తుతం నోబెల్ కమిటీ ఒక్కొక్క విభాగానికి బహుమతులను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే శాంతి పురస్కారాన్ని ఈ నెల 7న ప్రకటించనున్నారు.
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత జర్నలిస్టులు.. ఇంకా ఎవరంటే? - నోబెల్ అవార్డు ఇండియా
భారత్‌కు చెందిన జర్నలిస్టులు మహ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హా నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. టైమ్స్ మేగజైన్ రూపొందించిన జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి.
2022 నోబెల్ శాంతి పురస్కారానికి గానూ మొత్తం వ్యక్తులు, సంస్థలు కలిపి 343 మంది పోటీలో ఉన్నారు. ఇందులో పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులూ ఉన్నారని తెలిసింది. నోబెల్ కమిటీ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించనప్పటికీ.. టైమ్స్ మేగజైన్ రూపొందించిన జాబితాలో ఆల్ట్‌న్యూస్ వ్యవస్థాపకులతో పాటు, పలువురు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వారిలో ఉన్నారని తెలిసింది. వీరితో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రెటా దన్‌బెర్గ్, డబ్ల్యూహెచ్‌ఓ, పోప్ ఫ్రాన్సిస్ వంటి వారు రేసులో ఉన్నారు.
భారత్‌లో ఫేక్ న్యూస్ కట్టడికి 'ఆల్ట్‌న్యూస్' పనిచేస్తోంది. సోషల్‌మీడియాలో ప్రచారంలో ఉండే నకిలీ సమాచారాన్ని విశ్లేషించి వాస్తవాలను తన వెబ్‌సైట్‌లో పెడుతోంది. అయితే, ఇటీవల 'ఆల్ట్‌న్యూస్' వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ జుబేర్‌ను ఈ ఏడాది జూన్‌లో దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం నాటి ఓ ట్వీట్ వ్యవహారంలో అరెస్ట్ చేయగా.. నెల రోజుల తర్వాత సుప్రీం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.