పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తున్న పెగసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం పెదవివిప్పింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.
ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీస్‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా..? అని సీపీఎం ఎంపీ వి.శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. "ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదు" అని తెలిపారు.
సంచలన కథనాలు..
ఎన్ఎస్ఓ గ్రూపు అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌తో భారత్ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీసహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.