దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్న తరుణంలో మహమ్మారిని కట్టడిచేసే ప్రక్రియలో ఆత్మసంతృప్తికి స్థానం లేదని పేర్కొంది కేంద్రం. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఆగస్టు 31 వరకు కొవిడ్ మార్గదర్శకాలను పొడిగించింది.
ఐదు దశల వ్యూహం ' పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్స, టీకాల పంపిణీ, కొవిడ్ నిబంధనల అమలు'ను తప్పనిసరిగా కొనసాగించాలని సూచిస్తూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. రానున్న పండగలు, ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
"కేసుల సంఖ్య తగ్గుతుండటం సంతృప్తికర అంశమే. కానీ మొత్తం కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ ఆత్మసంతృప్తికి స్థానం లేదు. జాగ్రత్తగా ఆలోచించి ఆంక్షలను తొలగించాలి. వైరస్ పునరుత్పత్తి సంఖ్య(ఆర్ ఫ్యాక్టర్) 1 శాతం లోపే ఉండటం సానుకూలాంశం. కొన్ని రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువగా ఉంది. ఆర్ ఫ్యాక్టర్ పెరగకుండా చూసుకోవాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలి."