Farmers death: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఏడాదికాలంగా చేపట్టిన ఆందోళనల్లో సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది.
రైతు మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కేసుల ఉపసంహరణపై విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదన్నారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావే లేదని తోమర్ స్పష్టం చేశారు. అసలు ఇలాంటి ప్రశ్నే రావొద్దన్నారు.
దీనిపై స్పందించిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇది రైతులకు జరిగిన అవమానం అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో.. 700 మంది రైతులు చనిపోయారని, తమ వద్ద సమాచారం లేదని కేంద్రం అలా ఎలా చెబుతుందని మండిపడ్డారు.