కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వ్యవసాయ రంగం.. దేశానికి తల్లిలాంటిదని నొక్కిచెప్పారు. సాగు రంగానికి కీడు చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు.
పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు రాజ్నాథ్. సాగు చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు.
" వ్యవసాయ రంగానికి హాని చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నే లేదు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇటీవలి సంస్కరణలు తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావాలను వ్యవసాయ రంగం నివారించగలిగింది. ఈసారి వ్యవసాయ దిగుబడి, కొనుగోలు అత్యధికంగా ఉంది. మన ధాన్యాగారాలు పూర్తిగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక ఏడాది తొలి 5 నెలల్లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(35.73 బిలియన్ డాలర్లు) మన దేశానికి వచ్చాయి. గతఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం. అది మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతోంది."