ఒకవేళ బంగాల్లో హంగ్ ఏర్పడితే.. తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తేల్చిచెప్పారు. అదే సమయంలో.. మెజార్టీ లేకపోతే.. భాజపా, తృణమూల్ కాంగ్రెస్‌లు జతకలిసే అవకాశం ఉందని ఆరోపించారు.
ఎన్నికలను సీఎం మమతా బెనర్జీ మతపరంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.
"మమతా బెనర్జీ వల్లే బంగాల్లో మతతత్వ రాజకీయాలు ప్రవేశించాయి. ఏ పార్టికి మెజార్టీ లేకపోతే.. ఫలితాల తర్వాత టీఎంసీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అంతేకాకుండా తమ కూటమి సంయుక్త మోర్చా.. తృణమూల్ మద్దతు కోరే అవకాశాలు కూడా శూన్యం.
-అధిర్ రంజన్ చౌదరి, బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షులు.
'అసహనంలో మమత'
భాజపాకు వ్యతిరేకంగా నిలబడటంలో టీఎంసీ పూర్తిగా విఫలమైందని అన్నారు చౌదరి. ముస్లింలు పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని మమతా బెనర్జీ అనడం ఆమెలోని అసహనాన్ని, మతతత్వాన్ని వ్యక్తపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదే పని ఆమె గత పదేళ్లుగా చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు.. అబ్బాస్ సిద్దిఖ్వీ పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడి మతం విషయంలో రాజీపడ్డాయన్న ఆరోపణలను అధిర్ రంజన్ చౌదరి ఖండించారు.
బంగాల్లో 294 శాసనసభ స్థానాలకు ఎనిమిది దశల్లో పోలింగ్ జరుతోంది. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడుతాయి.
ఇదీ చదవండి:'దీదీ.. హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'