కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాతృత్వ, మెడికల్ ఇలా అనేక రకాల సెలవులు మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 10-19 వయసు మధ్యగల పిల్లలలో పరిశుభ్రమైన నెలసరిని ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. నాణ్యత గల సానిటరీ న్యాప్కిన్స్ వినియోగం, పర్యావరణ హితంగా తయారీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం భారతీయ జనఔషధి ప్రయోజన పథకం కింద తక్కవ ధరకే నాణ్యమైన న్యాప్కిన్స్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
లైంగిక వేధింపులపై 1349 ఫిర్యాదులు: మరోవైపు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం పెట్టిన పోర్టల్లో 2017 నుంచి ఇప్పటివరకు 1349 ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్(షీ బాక్స్) పేరిట 2017లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సంబంధిత శాఖకు చేరి సరైన చర్యలు తీసుకుంటుంది.