రాబోయే ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఆర్‌వీఎం)ను వినియోగించడం లేదని, అలాగే ఇవి ప్రవాస భారతీయ ఓటర్ల కోసం ఉద్దేశించినవి కావని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. లోక్‌సభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు శుక్రవారం ఆయన రాతపూర్వక బదులిస్తూ.. ఎలక్షన్ కమిషన్ సైతం ఇదే విషయాన్ని తెలిపిందన్నారు. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి.
'వచ్చే ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ విధానం!'.. కేంద్ర మంత్రి స్పందన ఇదే - కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రవాస భారతీయ ఓటర్ల కోసం ఉద్దేశించినవి కావన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. రాబోయే ఎన్నికల్లో వీటిని వినియోగించడం లేదన్నారు. లోక్‌సభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు శుక్రవారం ఆయన రాతపూర్వక బదులిస్తూ.. ఎలక్షన్ కమిషన్ సైతం ఇదే విషయాన్ని తెలిపిందన్నారు.
ఎలక్షన్ కమిషన్, సాంకేతిక నిపుణుల బృందం మార్గదర్శనంలో ప్రభుత్వ రంగ సంస్థ 'ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(ఈసీఐఎల్) బహుళ నియోజకవర్గాల రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. వీటి ద్వారా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను ఎన్నికల్లో భాగస్వాములను చేయొచ్చని దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఈసీ సమగ్రంగా వివరణ పంపిందని మంత్రి తెలిపారు. ఆర్‌వీఎంల వల్ల నకిలీ ఓట్లు పెరగవని, ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంల మాదిరిగానే సమర్థంగా పనిచేస్తాయని ఈసీ అందులో తెలిపిందని గుర్తుచేశారు. రిమోట్ ఓటింగ్‌పై తామింకా పని చేస్తున్నామని, ఇది అంత సులువైన ప్రక్రియ కాదని.. ఒక నిర్ణయానికి రావడానికి ప్రజాస్వామ్యంలో సమయం పడుతుందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గత నెలలో తెలిపారని రిజిజు వెల్లడించారు.