భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. వారి వ్యాఖ్యల్ని ప్రచారాలుగా తిప్పికొడుతూ.. అలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతను చెరపలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'ఏ ప్రచారం భారతదేశ ఐక్యతను దెబ్బతీయలేదు. ఏ ప్రచారం భారత్ కొత్త లక్ష్యాన్ని అధిగమించడాన్ని ఆపలేదు. అదేవిధంగా భారత తలరాతను ఏ ప్రచారం నిర్ణయించలేదు. పురోగతి సాధించడానికి భారత్ ఐక్యంగా, కలిసికట్టుగా ఉంది' అని పేర్కొంటూ.. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేశారు.
ఇప్పటికే అంతర్జాతీయ ప్రముఖుల స్పందనపై భారత విదేశాంగ శాఖ తనదైన శైలిలో స్పందించింది. దేశంలో జరుగుతున్న సంఘటనలపై కామెంట్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఓ ప్రకటన ద్వారా బదులిచ్చింది. సాగు చట్టాల్ని పార్లమెంటు పూర్తి చర్చల తర్వాతే ఆమోదించిందని.. కొన్ని స్వార్థ ప్రయోజనాల గ్రూపులు నిరసనలపై తమ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.