దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైనట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కొత్తగా మ్యుటేషన్ చెందిన రకాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సెకండ్ వేవ్‌కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని నిర్ధారించే రుజువులు ఇప్పటివరకు బయటపడలేదని, అయినప్పటికీ ఇది కూడా కారణమయ్యే అవకాశాలున్నాయని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజుల్లోనే దేశంలో మరోసారి వైరస్ ఉద్ధృతి పెరగడానికి గల కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.
సెకండ్ వేవ్‌కు కారణాలు..?
దేశంలో గత కొన్నిరోజులుగా మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం రికార్డు స్థాయి కేసులు బయటపడుతున్నాయి. ఇలా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ముఖ్య కారణమని భారతదేశ అత్యున్నత సైన్స్ పురస్కారమైన శాంతి స్వరూప్ భట్నాగర్ గ్రహీత, ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ స్పష్టం చేశారు. దేశంలో వైరస్ సోకే అవకాశమున్న వారి సంఖ్య ఇంకా అధికంగా ఉండడంతో పాటు గత నాలుగు నెలలుగా కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే సెకండ్ వేవ్‌కు దారితీసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మహమ్మారి తీవ్రత కొనసాగుతోన్న సమయంలోనే వ్యాపార, వినోద కార్యకలాపాలు పూర్వస్థితికి రావడం కూడా ఇందుకు కారణమని షాహిద్ జమీల్ విశ్లేషించారు.
ఇదీ చదవండి:కరోనా పంజా- దేశంలో కొత్తగా 59,118 కేసులు
మ్యుటేషన్ చెందిన రకాలు కారణమా..?
కరోనా సెకండ్ వేవ్‌కు మ్యుటేషన్ చెందిన రకాలే కారణమని చెప్పేందుకు ఎలాంటి రుజువులు లేనప్పటికీ అది కూడా ఓ కారణం అయ్యే అవకాశం ఉందని షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు. తొలి దఫా విజృంభణతో పోలిస్తే సెకండ్ వేవ్ కాలంలో కొవిడ్ మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఇక దేశంలో కొన్ని చోట్ల డబుల్ మ్యుటేషన్ చెందినట్లు వస్తోన్న నివేదికలపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతానికి వైరస్ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషన్లు కారణమని చెప్పలేమని, కానీ, అది కూడా సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. దేశంలో కొత్తగా వెలుగుచూస్తున్న మ్యుటేషన్‌లపై ఎప్పటికప్పుడు పరిశోధన జరుగుతోందన్నారు.
ఇదీ చదవండి:కరోనా పంజా: భారత్‌లో మరో కొత్త వేరియంట్!