భారత్‌కు వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఇకపై వారికి ప్రయాణానికి ముందు లేదా భారత్ చేరుకున్నాక కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు(guidelines on international travel) జారీచేసింది. ఒకవేళ దేశంలోకి వచ్చాక లేదా హోం క్వారంటైన్(home quarantine guidelines) సమయంలో కరోనా లక్షణాలు వెలుగుచూస్తే మాత్రం చిన్నారులకు పరీక్షలు చేయించాలి. పాజిటివ్ అని వెల్లడైతే.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాల ప్రకారం చికిత్స చేయించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
"భారత్ రావడానికి ముందు, భారత్ వచ్చాక కరోనా పరీక్షలు(Corona test) చేయించుకోవడం నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు మినహాయింపు ఇస్తున్నాం. ఒకవేళ వారిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించి, అవసరమైతే చికిత్స అందించాలి" అని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని వెల్లడించింది.