బర్డ్ ఫ్లూలను ఎదుర్కొనే ఎటువంటి వ్యాక్సిన్‌లకు భారత్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మనదేశమే కాదు, అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య దేశాలు కూడా బర్డ్ ఫ్లూను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లకు అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. 'ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా(బర్డ్ ఫ్లూ) నిర్మూలనకు వ్యాక్సిన్ పరిష్కారం కాదనే విషయాన్ని వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎనిమల్ హెల్త్(ఓఐఈ) సూచిస్తోంది' అని కేంద్ర కేంద్ర పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ రాజ్యసభలో బర్డ్ ఫ్లూపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కఠినమైన జీవభద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు లేకుండా వ్యాక్సిన్‌లు వేస్తే పౌల్ట్రీ ఉత్పత్తుల్లో ఇది సాధారణ వైరస్‌గా మారే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వేసిన పౌల్ట్రీ ఉత్పత్తుల్లో ఎక్కువకాలం వైరస్ వ్యాప్తి కొనసాగితే, చివరకు వైరస్‌లో జన్యు మార్పులకు కారణం అవుతుందన్నారు. చాలా దేశాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఆయన, ఇదే కొనసాగితే జంతువుల్లో వైరస్‌ను గుర్తించడం కూడా ఇబ్బందిగానే మారుతుందని స్పష్టంచేశారు. ఇక ఇప్పటివరకు దేశంలో 14 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.