Bharat Biotech: కొవాగ్జిన్ టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పనిలేదని స్పష్టం చేసింది దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్. తాము అలా సూచించలేదని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది.
Bharat Biotech Covaxin: కొవాగ్జిన్ తీసుకున్న పిల్లలకు.. 3 పారాసెటమాల్ 500 ఎంజీ. టాబ్లెట్లు ఇస్తున్నట్లు తెలిసిందని, అలాంటివి అవసరం లేదని పేర్కొంది.
''కొవాగ్జిన్ వ్యాక్సిన్ పొందిన పిల్లలకు ఆయా టీకా కేంద్రాల్లో పారాసెటమాల్ 500 ఎంజీ. టాబ్లెట్లు 3 చొప్పున ఇస్తున్నట్లు మాకు తెలిసింది. కొవాగ్జిన్ తీసుకున్నవారు.. పారాసెటమాల్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ వాడాల్సిన పనిలేదు.
30 వేలమందిపై మేం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. 10 నుంచి 20 శాతం మందికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అవి కూడా చిన్నవే. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఎలాంటి మందులు వాడొద్దు. వైద్యుడిని సంప్రదించాకే.. మెడికేషన్ పాటించండి.
వేరే ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారికి పారాసెటమాల్ తీసుకోవాలని సూచించారు. కొవాగ్జిన్‌కు అవసరం లేదు.''
- భారత్ బయోటెక్ ప్రకటన
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 148 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసింది కేంద్రం. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు కూడా కొవాగ్జిన్ టీకా పంపిణీ జరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని చోట్లా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.