కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాటల దాడి చేశారు. ఆ పార్టీని మించిన అవినీతిపరులు ఎవరూ లేరన్నారు. అసోం ఎన్నికల్లో భాగంగా శనివారం ఆమె మరియాని నియోజకవర్గం పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు లబ్ధి కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల కొనసాగించేందుకు భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం శర్వానంద్ సోనోవాల్ రాష్ట్రంలో అనేక పథకాలు అమలుచేస్తున్నారన్నారు. భాజపా ఒక్కటే పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
వారిని మించిన అవినీతిపరులెవరు?: స్మృతి - అసోం ఎన్నికలు
అసోం పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీని మించిన అవినీతిపరులు ఎవరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసోం నుంచి గతంలో రాజ్యసభకు ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి (ఆయన పేరు ప్రస్తావించకుండా) స్మృతి విమర్శలు చేశారు. అసోం నుంచి కొందరు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని కూడా అయ్యారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కానీ అసోంకు ఎయిమ్స్ మాత్రం నరేంద్ర మోదీ హయాంలోనే వచ్చిందన్నారు. మరియానిలో భాజపా అభ్యర్థి రమణి తంటి తరఫున స్మృతి ప్రచారం నిర్వహించారు. గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత రూప్‌జ్యోతి కుర్మిపై రమణి పోటీ పడుతున్నారు. అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మరియాని అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 27న తొలి విడతలో పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి:అభ్యర్థుల ఎంపికపై భాజపా సీఈసీ చర్చ