No One Contesting In This Gram Panchayat Election : బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భార్యలు చనిపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఎన్నికల అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి పోటీ చేయాలనుకున్నా వారి భార్యలు అడ్డుకుంటున్నారు.
అసలు ఏం జరిగింది?
Village Panchayat Election Constant Wife Dies :యోగపట్టి మండలంలో బైరాగి సిస్వా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో డిసెంబర్ 28న పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటివరకూ ఎవరూ నామినేషన్ వేయలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన వారి భార్య చనిపోతుందని, గత దాదాపు 15 ఏళ్లుగా ఇలాగే జరుగుతుందని గ్రామస్థులు చెబుతున్నారు. మూఢనమ్మకాలను పక్కనబెట్టి ఎవరైనా ముందుకు వచ్చినా వారి భార్యలు అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. ఈ కారణంగా పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఈ విషయంపై బైరాగి సిస్వా ఉప సర్పంచ్ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు.
"గతంలో మా గ్రామంలో మూడో నంబర్ వార్డు నుంచి ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత వారి భార్యలు చనిపోయారు. అయితే అనారోగ్యం లేదా మరేదైనా కారణం వల్ల మరణం సంభవించి ఉండవచ్చు. కానీ ప్రజల్లో భయం ఉండిపోయింది"
-- శేష్ యాదవ్, బైరాగి సిస్వా గ్రామ ఉప సర్పంచ్
2006 ఎన్నికల్లో వార్డు నంబర్ 3 నుంచి హిరామన్ యాదవ్ అనే వ్యక్తి పోటీ చేశాడని, ఆ తర్వాత అతడి భార్య పసపతి దేవి మరణించిందని గ్రామస్థులు తెలిపారు. అనంతరం 2011, 2016లో ఇద్దరు పోటీ చేయగా వారి భార్యలు కూడా చనిపోయారట. ఆ తర్వాత మరో ఇద్దరు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే వారి భార్యలు కూడా చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కారణం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గ్రామంలో వార్డు మెంబర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిపై గ్రామ సర్పంచ్ కేదార్ రాం స్పందించారు.