దేశంలో కరోనా రక్కసి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తాజాగా కేంద్రం స్పందిస్తూ వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ చేసి స్పష్టతనిచ్చింది.
లాక్డౌన్ చివరి అస్త్రమే..
"మే 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ, నిజమేంటంటే.. ఆ పోస్టులు పూర్తిగా అవాస్తవం. కేంద ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదు" అని పీఐబీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్ చివరి అంశం కావాలి అన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్‌మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. మే 3 నుంచి లాక్‌డౌన్ పెట్టనున్నారని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసినట్లుగా ఉన్న పోస్టులు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే తాము అలాంటి వార్తలేమీ ప్రసారం చేయలేదని సదరు టీవీ ఛానల్ పేర్కొంది.