PM Modi Terrorism: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై దిల్లీ వేదికగా 'నో మనీ ఫర్ టెర్రర్' అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. "గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోం. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు చురుకైన, వ్యవస్థీకృత స్పందన అవసరం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మనింటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి" అని మోదీ స్పష్టం చేశారు.