తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనాతో చర్చల్లో అర్థవంతమైన ఫలితం రాలేదు'

వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన సైనిక ప్రతిష్టంభనపై చైనాతో జరిగిన చర్చల్లో అర్థవంతమైన ఫలితం లభించలేదని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. సరిహద్దులో ప్రస్తుతం యథాతథ స్థితి ఉందని.. ఈ సమయంలో బలగాల మోహరింపులో వెనకడుగు వేయలేమని అన్నారు. తర్వాతి దఫా సైనిక చర్చలు త్వరలోనే జరుగుతాయని తెలిపారు.

no-meaningful-outcome-of-talks-with-china-on-lac-standoff-status-quo-remains-rajnath-singh
'చైనాతో చర్చల్లో అర్థవంతమైన ఫలితం లేదు'

By

Published : Dec 30, 2020, 8:47 AM IST

తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన విషయంలో చైనాతో జరిగిన చర్చలు సఫలం కాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. సైనిక, దౌత్యపరమైన చర్చల్లో 'అర్థవంతమైన ఫలితం' లభించలేదని స్పష్టం చేశారు. ఏఎన్​ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. సరిహద్దులో 'యథాతథ స్థితి' ఉందని చెప్పారు. ఈ స్థితి కొనసాగినంతకాలం బలగాల మోహరింపులో వెనకడుగు ఉండకూడదని అన్నారు.

ఈ నెల మొదట్లో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ)​ సమావేశాన్ని వర్చువల్​గా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు రాజ్​నాథ్. తర్వాతి దఫా సైనిక చర్చలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశం ఉందన్నారు.

"చైనా, భారత్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమే. కానీ, ఇప్పటివరకు ఇందులో విజయం లభించలేదు. సైనిక స్థాయిలో మరోసారి చర్చలు జరుగుతాయి. ఏ సమయంలోనైనా అవి జరగొచ్చు. అర్థవంతమైన ఫలితం మాత్రం రాలేదు. ప్రస్తుతం యథాతథ స్థితి ఉంది. యథాతథ స్థితి ఉన్నప్పుడు బలగాల మోహరింపు తగ్గించడమేనిది ప్రశ్నార్థకమే. మావైపు మోహరింపులలో తగ్గింపు ఉండదు. వారి మోహరింపు కూడా తగ్గదనే అనుకుంటున్నా. యథాతథ స్థితి సానుకూలమైన పరిణామం కాదు. చర్చలు జరుగుతున్నాయి. సానుకూల పరిష్కారం వస్తుందనే ఆశిస్తున్నాం."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఏ అంశాలపై చర్చించాలనే విషయంపై ఇరుదేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిపారు రాజ్​నాథ్. దౌత్య, సైనిక స్థాయిలో సన్నిహిత చర్చలు జరపాలని డిసెంబర్ 18న జరిగిన డబ్ల్యూఎంసీసీ సమావేశాల్లో నిర్ణయించినట్లు చెప్పారు.

తర్వాతి దశ(9వ) కమాండర్ల సమావేశం వీలైనంత త్వరగా నిర్వహించాలని అంగీకరించుకున్నట్లు వివరించారు. తద్వారా బలగాలను వెనక్కి మళ్లించి, సరిహద్దులో శాంతి నెలకొల్పే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మహాయజ్ఞానికి ముందస్తు కసరత్తు- 'డ్రై రన్​'

ABOUT THE AUTHOR

...view details