No Entry for Telugu Media in Press Meet: మార్గదర్శి అంశంపై ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్.సంజయ్ దిల్లీ ఏపీభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశానికి తెలుగు మీడియాను రానీయకుండా సీఐడీ అధికారులు విశ్వప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మార్గదర్శిపై సీఐడీ అధికారులు చేస్తున్న ఆరోపణల గురించి తెలుగు మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారన్న ఉద్దేశంతో వారిని రానీయకుండా చేయాలని చూశారు. మార్గదర్శి అంశాన్ని దేశవ్యాప్త విషయంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఐడీ ఏడీజీ బుధవారం దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టారు. దానికి ఆంగ్ల, హిందీ పత్రికలు, ఛానళ్లతోపాటు తెలుగు నుంచి సాక్షి ఛానల్‌ను లోపలికి అనుమతించారు.
మిగతా తెలుగు పాత్రికేయులందర్నీ బయటే నిలబెట్టి సాక్షి మీడియా ప్రతినిధులను మాత్రమే ఎలా లోపలికి రానిస్తారని కొందరు తెలుగు మీడియా ప్రతినిధులు ఏపీ సీఐడీ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు వారిని దబాయించి బయటికి పంపించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో సాక్షి మీడియాతో పాటు అందరూ కెమెరాలు పెట్టుకోవాలని, రిపోర్టర్లు మాత్రం బయటికెళ్లాలని సూచించారు. దానికి తెలుగు మీడియా ప్రతినిధులు అంగీకరించలేదు.
తెలుగు మీడియానే బయటికెళ్లమనడం ఏంటి?:ఒక ప్రభుత్వ అధికారి వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనంలో విలేకర్ల సమావేశం పెట్టి కేవలం తెలుగు మీడియానే బయటికెళ్లమని ఎందుకు అడుగుతున్నారు? వారు విలేకర్ల సమావేశానికి హాజరైతే మీకు సమస్య ఏంటి? మీరు తెలుగు మీడియా, జాతీయ మీడియాను ఎందుకు వేరు చేసి చూస్తున్నారని తెలుగు మీడియా ప్రతినిధులు నిలదీశారు. జాతీయ మీడియాతో మాట్లాడటానికి ఇదే సరైన వేదిక అని ఏపీసీఐడీ ఏడీజీ ఇక్కడికొచ్చారని పోలీసు సిబ్బంది చెప్పారు. దిల్లీలో ఉన్న తాము కూడా జాతీయ మీడియా ప్రతినిధులమేనని.. కేంద్ర మంత్రులు, అధికారుల విలేకర్ల సమావేశాలకు కూడా వెళ్తుంటామని విలేకర్లు చెప్పారు. దేశ రాజధానిలో ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా అన్న భేదభావాలు ఉండవన్నారు. దీంతో పోలీసులు సాక్షి ప్రతినిధిని కూడా బయటికి పంపుతామన్నారు. మేం సాక్షి గురించి మాత్రమే అడగటం లేదు.. జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా అని మీరు వేర్వేరుగా ఎందుకు చూస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు.
ఏపీసీఐడీ ఏడీజీ తొలుత జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమనండి, ఆయన మాట్లాడినంతసేపు మేం ఎలాంటి ప్రశ్నలు అడగం, ఆయన తెలుగు మీడియాకు అనుమతించిన తర్వాతే ప్రశ్నిస్తాం అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో విలేకర్ల సమావేశం పెట్టి ఎందుకు రహస్యం పాటిస్తారు? అని ప్రశ్నించగా.. మేం ఏమీ దాయడం లేదని, కావాలంటే కెమెరాలు పెట్టుకోమని పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. కెమెరాలు ఉన్నప్పుడు తాము వస్తే అభ్యంతరమేంటని విలేకర్లు ప్రశ్నించారు. ఈ విలేకర్ల సమావేశమైన తర్వాత మళ్లీ మిమ్మల్ని ఆహ్వానిస్తామని, అంతవరకు మీ కెమెరాలు పెట్టేసి బయటికెళ్లిపోండి, తర్వాత రండి అని పోలీసులు స్పష్టం చేశారు. ఒకే విషయాన్ని విలేకర్లకు గ్రూపులవారీగా వేర్వేరుసార్లు చెప్పాల్సిన అవసరమేంటి? కెమెరామెన్లు ఉండి.. విలేకర్లు బయటకెళ్లండి అని చెప్పడం ఎందుకుని పాత్రికేయులు ప్రశ్నించారు. తాము ఇక్కడ 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, ఎప్పుడూ ఇలా విలేకర్ల సమావేశం నుంచి బయటికెళ్లాలని చెప్పిన దాఖలాల్లేవని పేర్కొన్నారు.