తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీకి ఎన్నికలు లేవ్​.. సభ్యులను ఖర్గేనే ఎంపిక చేస్తారు' - congress cwc meeting outcome

కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత నియామక మండలి అయిన CWC సభ్యులను ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ వెల్లడించారు. ఈ నిర్ణయానికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులందరూ పూర్తి మద్దతిస్తారన్న విశ్వాసం తమకుందని ఆయన తెలిపారు.

CWC MEETING IN RAIPUR
CWC MEETING IN RAIPUR

By

Published : Feb 24, 2023, 3:50 PM IST

కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత నియామక మండలి అయిన కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ-సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక బాధ్యతను అధ్యక్షుడికి అప్పగిస్తూ స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్కింగ్​ కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నామినేట్ చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ శుక్రవారం వెల్లడించారు. ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో కాంగ్రెస్​ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఏఐసీసీ స్టీరింగ్​ కమిటీ సమావేశమైంది. అయితే ఈ భేటీకి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ హాజరుకాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్.. మీడియా సమావేశంలో పూర్తి వివరాలను తెలిపారు.

"CWC ఎన్నికల అంశంపై స్టీరింగ్​ కమిటీ చర్చించింది. సమావేశానికి హాజరైన 45 మంది సభ్యులు.. కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సభ్యులను ఎంపిక​ చేయడానికి పార్టీ అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పలువురు సభ్యులు ఎన్నికలకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ ఏకగ్రీవ నిర్ణయానికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులందరూ పూర్తి మద్దతిస్తారన్న విశ్వాసం మాకుంది. పార్టీ రాజ్యాంగంలోని 32 నియమ నిబంధనలకు 16 సవరణలు తీసుకురావాలన్న ప్రతిపాదనలపై ప్లీనరీలో నిర్ణయం తీసుకోనున్నాం. పార్టీకి చెందిన మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ వర్కింగ్​ కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తాం" అని జైరాం రమేశ్​ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​

అంతకుముందు, కాంగ్రెస్​ స్టీరింగ్​ కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. రాయ్​పుర్​ కాంగ్రెస్​ సమావేశాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. "సుమారు వందేళ్ల క్రితం 1924లో జాతీయ కాంగ్రెస్​కు అధ్యక్షుడిగా మహత్మాగాంధీ ఇక్కడే ఎన్నికయ్యారు. గాంధీజీ ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్​ అధ్యక్షుడైనప్పటికీ అతి తక్కువ కాలంలోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలను, యువతను కలుపుకుని ఉద్యమాన్ని తీర్చిదిద్దారు. మళ్లీ ఇప్పుడు అదే స్ఫూర్తి కావాలి. అదే ఆయనకు మనం ఇచ్చే అతిపెద్ద నివాళి. మరికొన్ని నెలల్లో జరగబోయే ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు మనకు పెద్ద సవాలు. పెద్ద అవకాశం కూడా అదే. కాంగ్రెస్​ పార్టీ నిబంధనల ప్రకారం.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నకున్న తర్వాత పార్టీ వర్కింగ్ కమిటీనే స్టీరింగ్​ కమిటీగా మారుతుంది. తర్వాత సమవేశానికి కల్లా వర్కింగ్​ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తాం. పార్టీలో ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ పద్దతే మా బలం" అని ఖర్గే తెలిపారు.

కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. మల్లిఖార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం జరిగిన స్టీరింగ్​ కమిటీ సమావేశంలో 2024 లోక్​సభ ఎన్నికలకు స్పష్టమైన రోడ్​మ్యాప్​ను రూపొందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.. ఈ ప్రతిపాదనలన్నీ ఫిబ్రవరి 26న జరిగే చివరి రోజున ఆమోదం పొందనున్నాయి. అనంతరం 26వ తేదీ సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలను ముగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details