సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 18న దేశవ్యాప్తంగా రైల్‌రోకో ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పునరుద్ఘాటించారు. అందులో ఎలాంటి మార్పు లేదని ఈటీవీ భారత్‌తో అన్నారు. చక్కాజామ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జరగలేదని.. రైల్‌రోకో మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఉద్యమానికి రైతుల మద్ధతు తగ్గుతుందన్న వార్తల్ని కొట్టిపారేశారు. అంతేకాకుండా తనకు రూ.80కోట్ల ఆస్తులున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఆస్తి తమరందరిదన్నారు. సాగు చట్టాల్ని రద్దు చేశాకే ఇంటికెళ్తామని టికాయిత్ అన్నారు.
అలాంటి పరిస్థితి అవసరమా?
ప్రభుత్వం మొండిపట్టుదల వీడితే సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుందని అన్నారు టికాయిత్. ఉద్యమంపై భవిష్యత్ ప్రణాళిక ఏంటని అడగ్గా.. అది కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా రైతు ఉద్యమానికి విదేశీయుల మద్దతు గురించి అడగ్గా.. వారి(విదేశీయుల) వల్ల ఏమీ కాదని, అయినా ఇతర దేశాల ముందు కేంద్రం చెడ్డపేరు తెచ్చుకోవడం అవసరమా? అని అన్నారు. ప్రభుత్వం అందాక పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలని అని ప్రశ్నించారు.
3 రాష్ట్రాల్లో 7 మహాపంచాయత్‌లకు హాజరు
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల మద్దతు కూడగట్టేందుకు 3 రాష్ట్రాల్లో 7 మహాపంచాయత్( రైతు బహిరంగ సభ)లను నిర్వహించనున్నట్లు బీకేయూ తెలిపింది. టికాయిత్ వీటన్నింటికీ హాజరవుతారని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14 -23 మధ్య ఇవి జరుగుతాయని వెల్లడించింది.
ఇదీ చూడండి:అప్పు తీర్చలేదని బంధువుల అమానవీయ దాడి