ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ)(Thane municipal corporation) మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారిని ప్రభుత్వ బస్సులో ప్రయాణించేందుకు అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు టీఎంసీ(Thane municipal corporation) మేయర్ నరేశ్ మఖ్సే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
"నవంబర్ చివరినాటికి 100శాతం టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది నెరవేరేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. టీఎంసీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోనివారు కనిపిస్తే సమీపంలోని కేంద్రంలో వారికి తక్షణమే టీకా వేస్తాం. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు కచ్చితంగా తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని చూపించాలి. లేదంటే.. వారిని బస్సులో ప్రయాణించేందుకు అనుమతించం."
-ఠాణె మున్సిపల్ కార్పొరేషన్.