బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేలినా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది ఎవరనేదానిపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. నితీశ్ కుమార్ మరోసారి సీఎంగానే కొనసాగుతారా? అనూహ్యంగా ఎక్కువ సీట్లు నెగ్గిన భాజపా అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాలను పటాపంచలు చేస్తూ నితీశ్ కుమారే తదుపరి సీఎం అని బుధవారం స్పష్టతనిచ్చారు ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్ మోదీ. నితీశ్ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసే ఆలోచనేలేదని తేల్చిచెప్పారు.
"బిహార్ తర్వాతి సీఎం నితీశ్ కుమార్. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం. దానికి కట్టుబడి ఉంటాం. కూటమిగా ఉన్నప్పుడు ఒక భాగస్వామి ఎక్కువ సీట్లు గెలుస్తారు. మరొకరికి తక్కువ స్థానాలే రావచ్చు. కానీ మేమంతా సమానం. ప్రజలు ఎన్డీఏకు ఓటు వేశారు".
-- సుశీల్ మోదీ, భాజపా నేత
ఎల్జేపీతో బంధం కొనసాగించడంపై ప్రశ్నించగా.. చిరాగ్ కూటమి నుంచి వైదొలిగినందున ఆ పార్టీ గురించి మాట్లాడాలని అనుకోవడంలేదని స్పష్టం చేశారు సుశీల్. బిహార్ ఎన్డీఏలో ఎల్జేపీ లేదని స్పష్టంచేశారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో.. 125 స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఈ కూటమిలోని భాజపా(74), జేడీయూ(43), వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(4), హిందుస్థాన్ అవామీ మోర్చా(4) సీట్లను దక్కించుకున్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ (ఎంజీబీ) 110 స్థానాల్లో గెలుపొందింది. ఈ కూటమిలోని ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.