No Confidence Motion In Parliament : పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతుంది. ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై సమాధానం ఇవ్వనున్నారు. మంగళవారం సమావేశమైన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
No Confidence Motion Lok Sabha : బీఏసీ సమావేశం నుంచి విపక్ష కూటమి 'ఇండియా' సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు.. తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై తక్షణమే చర్చ చేపట్టాలనే నిబంధనలు లేవని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తీర్మానంపై.. సభ స్వీకరించిన 10 పనిదినాల్లోగా చర్చ చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని వాదించింది.
జులై 26న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారు.
ప్రధాని మోదీ సభకు హాజరుకావాలని, మణిపుర్ అంశంపై ప్రకటన చేయాలని.. విపక్షాలు డిమాండ్ చేశాయని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ తెలిపారు. తాము వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టామని చెప్పారు. '16వ లోక్‌సభలో తెలుగు దేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన మరుసటి రోజే లిస్ట్ అయింది. కాబట్టి, జాప్యం సరికాదు.' అని ఆయన గుర్తుచేశారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
No Confidence Motion BJP : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 330 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కూటమి 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏకు పూర్తి బలం ఉన్నా.. తమకు గద్దె దించడంకన్నా 'ప్రభుత్వ వైఫల్యాల్ని' ఎండగట్టాలన్నదే తమ లక్ష్యమని విపక్ష నేతలు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
No Confidence Vote 2023 : మణిపుర్ హింస అంశంపై చర్చించేందుకు.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్.. అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు విడివిడిగా స్పీకర్ కార్యాలయానికి తీర్మాన నోటీసులు ఇచ్చారు.