No Confidence Motion How Many Times : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం.. మూజువాణి ఓటుతో వీగిపోయింది. అయితే ఈ అవిశ్వాసంపై లోక్‌సభలో మూడు రోజులపాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జరుగుతున్న హింసపై మోదీ సమాధానం చెప్పాలనే డిమాండుతో విపక్ష పార్టీలు ఈ అస్త్రాన్ని ప్రయోగించగా.. తన సుదీర్ఘ ప్రసంగంలో మోదీ అనేక అంశాలను ప్రస్తావించారు. కానీ ప్రధాని మాట్లాడుతుండగానే.. విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడం వల్ల మూజువాణి ఓటుతో ఈ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన అవిశ్వాసాల తీరును పరిశీలిద్దాం.
No Confidence Motion In India :దేశ స్వాతంత్ర్యానంతరం మొత్తంగా ఇప్పటివరకు 28సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొత్తం 14 మంది ప్రధానమంత్రుల్లో ఎనిమిది మంది వీటిని ఎదుర్కొన్నారు. సుదీర్ఘకాలం (పదేళ్లపాటు) అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ మాత్రం ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కొలేదు.
ఆ ఒక్కటి మినహా..
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకు (2023తో కలిపి) లోక్‌సభలో మొత్తం 28 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. అయితే వాటిలో ఒక్కటి మినహా అందులో అన్నీ వీగిపోయాయి. మొత్తం 27 అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ వరకు వెళ్లాయి. కేవలం మొరార్జీ దేశాయ్ హయాంలో (1979) మాత్రమే ఓటింగ్ జరగకుండానే ఆయన రాజీనామా చేశారు.
- 27 అవిశ్వాస తీర్మానాల్లో 22 తీర్మానాలు డివిజన్ ఓటు వరకు వెళ్లగా.. తాజా తీర్మానంతో కలిపి ఐదుసార్లు మాత్రమే వాయిస్ ఓటుతో (మూజువాణి) వీగిపోయాయి.
- అన్ని డివిజన్ ఓటింగుల్లోనూ అనుకూల వ్యతిరేక ఓట్ల మధ్య భారీ తేడా ఉంది. కేవలం 1993లో ఒక్కసారి మాత్రమే కేవలం 14 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది.
- పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 251 ఓట్లు తీర్మానానికి అనుకూలంగా రాగా.. 265 వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో అది కూడా వీగిపోయింది.
- డివిజన్ ఓటింగ్ జరిగిన 22 తీర్మానాల్లో తొమ్మిది సార్లు 200ఓట్ల తేడాతో వీగిపోగా.. మరో 10 తీర్మానాల్లో 100 నుంచి 200ఓట్ల తేడా కనిపించింది. మిగతావాటిలో కేవలం వందకు తక్కువ ఓట్ల తేడా ఉంది.