No Confidence Motion In Indian Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం కానుంది. మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు. బుధ, గురు వారాల్లోనూ ( No Confidence Motion 2023 Date ) అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
No Confidence Motion news : అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టింది. గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం ఇస్తారు.
బీజేపీ విప్.. నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ
No Confidence Motion Congress vs BJP : అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీజేపీ.. ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఆగస్టు 7 నుంచి 11 వరకు పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పక హాజరు కావాలని స్పష్టం చేసింది. మరోవైపు, తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మోదీ సర్కారును అన్ని అంశాలపై తాము గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.