భారత్లో కరోనా నివారణకు ఉపయోగిస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో కొవిషీల్డ్ టీకా వినియోగం వల్ల రక్తం గడ్డకడుతున్న సమస్యలు ఎదురవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు. టీకా తీసుకున్న తర్వాత ఎదురయ్యే ప్రతికూలతలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురుకాలేదని చెప్పారు.
"కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల సమర్థత, భధ్రతకు సంబంధించి క్లినికల్ డేటాను.. దేశంలోని వ్యాధి నియంత్రణ సంస్థలు పరీక్షించాయి. నేను మళ్లీ చెబుతున్నాను. మనదేశంలో వినియోగిస్తున్న టీకాలు అత్యంత సురక్షితమైనవి. భారత్లోని టీకాల భద్రత గురించి ఇప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."
- హర్షవర్ధన్, కేంద్ర వైద్య శాఖ మంత్రి.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంటూ.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని హర్షవర్ధన్ పేర్కొన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయడం సహా.. కరోనా నిబంధనల అమలుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.