India China border talks: తూర్పు లద్దాఖ్‌లో ఏర్పాడిన ప్రతిష్టంభనపై భారత్-చైనా మధ్య జరిగిన 14వ విడత చర్చల్లో పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడం వల్ల.. చర్చలు ఫలప్రదం కాకుండానే ముగిశాయని రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
14th round India China border talks:
సరిహద్దులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లిపోగా.. మిగిలిన ప్రదేశాల్లో సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగించాలని భారత్-చైనా నిర్ణయించాయి. సైనిక, దౌత్యపరమైన మాధ్యమాల ద్వారా సంప్రదింపులు చేసుకోవాలని అంగీకరించుకున్నాయి. ఇరు దేశాధినేతల మార్గనిర్దేశం ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నించాలని 14వ విడత చర్చల్లో అంగీకారానికి వచ్చాయి.
"ఇరుపక్షాలు ఎలాంటి దాపరికం లేకుండా లోతైన చర్చలు జరిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలు పంచుకున్నాయి. పరిష్కారం ద్వారా శాంతి, సుస్థిరతకు ఆస్కారం ఉంటుందని... తద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉంటుందని గుర్తించాయి. సైనిక, దౌత్యపరమైన మాధ్యమాల ద్వారా సంప్రదింపులు కొనసాగించి.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుక్కోవాలని అంగీకారానికి వచ్చాయి."
-భారత్-చైనా సంయుక్త ప్రకటన