తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా చిరునవ్వుకు కారణం.. ఎన్డీఏను వీడడమే!'

Nitish Kumar on BJP: భాజపాపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా గౌరవం లభించేదని తెలిపారు. ప్రస్తుత భాజపా నాయకులు.. జేడీయూ పార్టీని ముక్కలు చేయాలని చూశారని విమర్శించారు. 'నా పెదాలపై చిరునవ్వుకు కారణం.. భాజపాతో తెగతెంపులు చేసుకోవడమే'నని నితీశ్ అన్నారు.

nitish kumar on bjp
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

By

Published : Sep 5, 2022, 4:39 PM IST

భాజపాకు హ్యాండిచ్చి.. ఆర్జేడీతో దోస్తి కట్టిన దగ్గరి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ప్రతిమాట దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో తాజాగా రెండురోజుల పాటు జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తన చిరునవ్వు వెనక రహస్యాన్ని వెల్లడించారు.

'2013లో ఎన్డీఏను వీడాం. అది మంచి పని. 2017లో మళ్లీ వెనక్కి వెళ్లి.. పొరపాటు చేశాం. ఆ కారణంగా మన నుంచి చాలామంది దూరం జరిగారు. ఇప్పుడు భాజపాతో బంధం ముగింపు నిర్ణయాన్ని ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. మనం అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించాం. ఎంతో గౌరవం లభించేది. ఇప్పుడు వీరు (ప్రస్తుత భాజపా నాయకత్వాన్ని ఉద్దేశించి) పార్టీని ఎలా ముక్కలు చేస్తున్నారో అర్థమైంది.''

-- నితీశ్ కుమార్​, బిహార్ ముఖ్యమంత్రి

అలాగే 2017లో భాజపాతో చేతులు కలపాల్సి వచ్చిన పరిస్థితిపై చాలా జాగ్రత్తగా స్పందించారు. 'అప్పుడు మన మాట ఎవరూ వినలేదు. ఆ పరిస్థితి నన్ను ఎంతో బాధకు గురిచేసింది. మరోపక్క మనతో కలిసేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నించింది. ఆ పరిస్థితుల్లో నేను అంగీకరించాల్సి వచ్చింది. జేడీయూ ఉనికిలో ఉన్నంతకాలం మళ్లీ వారితో కలిసే ప్రశ్నే లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. 2017లో భాజపాతో కలిసే సమయంలో నితీశ్.. ఆర్జేడీతో పొత్తులో ఉన్నారు. ప్రస్తుతం ఆర్జేడీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ నేతల పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడారు.

ప్రస్తుత తరుణంలో నితీశ్ జాతీయ స్థాయి ప్రాతినిధ్యంపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని వాటిని తోసిపుచ్చుతున్నారు. అలాగే విపక్షాలు ఏకం కావాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్తున్నారు. 'ప్రతిపక్షం ఏకమైతేనే.. వారిని ఓడించగలం. నేను దిల్లీకి వెళ్తున్నాను. అక్కడ మనకు మద్దతు ఇచ్చే వారితో పాటు అందరిని కలుస్తాను' అని తెలిపారు.

చిరునవ్వు వెనక రహస్యం చెప్పిన నితీశ్..
'ఇటీవల నా పెదాలపై చిరునవ్వు ఎక్కువగా కనిపిస్తోందేంటని మీకు అనిపిస్తోందా..? ఇదంతా వారి నుంచి విముక్తి పొందడం వల్లే. మీరు సంతోషంగా ఉంటే.. మీరు కూడా నవ్వుతారు. ఇప్పుడు మనమంతా కలిసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం. ఈ దేశాన్ని ఆక్రమించాలని చూసే వారి నుంచి మనం విముక్తి పొందుతాం' అని తెలిపారు.

నా చిరునవ్వుకు కారణం.. ఎన్డీఏను వీడడమే!

ఇవీ చదవండి:విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్​.. సభ నుంచి భాజపా వాకౌట్​

గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యం.. ముస్లిం అంత్యక్రియల కోసం ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details