కాంగ్రెస్, లెఫ్ట్ సహా అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కోరారు. అలా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమని నీతీశ్ అన్నారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతిని పురస్కరించుకుని హరియాణాలోని ఫతేహాబాద్లో ఐఎన్ఎల్డీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇతర విపక్ష నేతలతో కలిసి పాల్గొన్న నీతీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ర్యాలీని భాజపాయేతర పార్టీల మధ్య ఐక్యతకు తొలి అడుగుగా అభివర్ణించారు నీతీశ్ కుమార్. ప్రస్తుతానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ఫ్రంట్ అవసరమని.. థర్డ్ ఫ్రంట్ కాదని అభిప్రాయపడ్డారు. బిహార్లో ఏడు పార్టీలు కలిసి ఉన్నాయని.. భాజపా ఒంటరిగా ఉందని అన్నారు. 2025 బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాజపా గెలవదని జోస్యం చెప్పారు నితీశ్.
" భాజపాయేతర పార్టీలన్నీ ఏకమైతే భాజపాను ఓడించవచ్చు. రాజకీయంగా లబ్ది పొందేందుకే భాజపా హిందూ-ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఈ రెండు వర్గాలు మధ్య విభేదాలు లేవు. 1947లో దేశ విభజన అనంతరం ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు."
-- నీతీశ్ కుమార్, బిహార్ సీఎం
ఐఎన్ఎల్డీ నిర్వహించిన ఈ ర్యాలీలో నీతీశ్ సహా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శిరోమణి అకాళీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన నేత అరవింద్ సావంత్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ తరపున ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.