Nitish Kumar CM how many times : బిహార్ రాజకీయాల్లో జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ది ప్రత్యేక స్థానం. వికాస్ పురుష్‌గా, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరుంది. శాశ్వత మిత్రులు, శత్రువులు లేరన్నట్టుగా కూటములు మార్చడంలోనూ ఆయన విలక్షణమే. ఇప్పుడు మరోమారు అదే పని చేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమికి గుడ్‌బై చెప్పి.. మహాకూటమితో జట్టు కట్టారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో సరికొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ఇన్నిసార్లు సీఎం అయినా.. 1989 తర్వాత నితీశ్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం విశేషం.
తొలిసారి ఎనిమిది రోజులే సీఎంగా..
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఏడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఎందుకంటే శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.
ఎంపీగా ఆరుసార్లు..
1977లో నితీశ్ కుమార్ నలంద జిల్లాలోని హర్నాట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1985లో అదే స్థానం నుంచి బరిలో దిగి రికార్డుస్థాయి మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 1985లోనే చివరిసారి. తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తనకు సరైన మెజార్టీ లేకపోవడంతో కేవలం ఎనిమిది రోజులకే (మార్చి 3 నుంచి 10 వరకు) రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ నిబంధన ప్రకారమే..
2005 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా- జేడీయూ కూటమి గెలుపొందింది. దీంతో నితీశ్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు కూడా ఆయనకు ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) సెక్షన్ ప్రకారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా శాసనమండలి)కు సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉంది. దీంతో 2006లో నితీశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా - జేడీయూ కూటమి భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రాగా.. ఆయన వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీ కాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు.