తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూటమి కోసం నీతీశ్​ రాయబారం.. కేజ్రీవాల్ నోట 'ఉమ్మడి పోరు' మాట!

Nitish Kumar Meets Arvind Kejriwal : ప్రతిపక్షాల కూటమిలో ఐక్యరాగం వినిపించేటట్లు కనిపిస్తోంది. దిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​ను రాజ్యసభలో అడ్డుకోవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ బిల్లును అడ్డుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అన్నారు. ​

nitish kumar meets arvind kejriwal
nitish kumar meets arvind kejriwal

By

Published : May 21, 2023, 1:55 PM IST

Updated : May 21, 2023, 2:30 PM IST

Nitish Kumar Meets Arvind Kejriwal : విపక్షాల ఐక్యతే లక్ష్యంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​తో ఆదివారం భేటీ అయ్యారు. విపక్ష కూటమిలో చేరడంపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. దిల్లీలోని బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​పై ఉమ్మడి పోరుకు సిద్ధమని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత కేజ్రీవాల్​కు కాంగ్రెస్​ నుంచి ఆహ్వానం అందకపోయినప్పటికీ.. మరుసటి రోజే విపక్ష కూటమి కోసం ఆయనతో నీతీశ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నీతీశ్​తో భేటీ అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిలిపివేయవచ్చని అన్నారు. ఒకవేళ కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఈ బిల్లును వీగిపోయేటట్లు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ వీగిపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న సందేశాన్ని ప్రజలకు పంపినట్లవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. దిల్లీ ప్రజలకు అండగా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ నిలబడతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కోల్‌కతాలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మంగళవారం కలుస్తాను. ఆ తర్వాత దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను కలవటానికి వెళ్తా. అన్ని పార్టీలతో మాట్లాడాలని నీతీశ్‌కుమార్‌ను అభ్యర్థించా. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఒక్కో నేతను కలుస్తా. రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చినప్పుడు అడ్డుకోవాలని కోరుతా. వర్తమాన రాజకీయ పరిస్థితులతోపాటు దిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ గురించి నీతీశ్​తో మాట్లాడా. కేంద్రం తేనున్న ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు అడ్డుకోవాలని నీతీశ్‌ను కోరా.

--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీ సీఎంతో నీతీశ్ కుమార్ సమావేశం

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​తో కలిసి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ను ఆదివారం కలిశారు. అరవింద్ కేజ్రీవాల్​కు అండగా నిలబడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రంపై పోరుకు ఆయనకు మద్దతుగా ఉండేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో కూడా మాట్లాడతానని నీతీశ్ అన్నారు.

'బీజేపీయేతర ప్రభుత్వాను వేధిస్తోంది'
ఎన్డీఏయేతర ప్రభుత్వాలను బీజేపీ వేధిస్తోందని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. కేంద్రం చర్యలతో ఇబ్బందిపడుతున్న కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వటానికి దిల్లీకి వచ్చామని ఆయన తెలిపారు. 'సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని విషయాలు స్పష్టమయ్యాయి. ఇంకా చెప్పటానికి ఏమీ లేదు. కానీ కేజ్రీవాల్​ను కేంద్రం ఇబ్బందిపెడుతున్న తీరు.. ప్రజాస్వామ్యానికి ముప్పు లాంటిది. రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారు. అలాంటి చర్యలను మేమంతా కలిసి అడ్డుకుంటాం.' అని తేజస్వీ అన్నారు.

ఆప్ నేతలతో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ భేటీ
Last Updated : May 21, 2023, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details