బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపాతో నీతీశ్ టచ్‌లోనే ఉన్నారని.. పరిస్థితులు డిమాండ్ చేస్తే కాషాయ పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారని అన్నారు. తాను బతికున్నంత వరకు మళ్లీ భాజపాతో పొత్తు పెట్టుకోబోనని నీతీశ్ కుమార్ తేల్చి చెప్పిన కొన్ని రోజులకే ప్రశాంత్ కిశోర్ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, పీకే వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ.. ఇవి కేవలం అసత్యాలేనని, గందరగోళం సృష్టించేందుకే పీకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది.
'భాజపాతో టచ్‌లో నీతీశ్.. మళ్లీ చేతులు కలపడం పక్కా'.. పీకే జోస్యం - నితీశ్ కుమార్ జేడీయూ బీజేపీ
అధికార ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన నీతీశ్ కుమార్.. మళ్లీ భాజపాతో పొత్తు పెట్టుకుంటారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. భాజపాతో ఆయన టచ్‌లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు నీతీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, ఆయన భాజపాతో టచ్‌లో ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహాయంతో నీతీశ్ భాజపాతో టచ్‌లోనే ఉన్నారు. అందుకే భాజపాతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ హరివంశ్‌ను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయమని కోరలేదు. ఆయన ద్వారా అవసరమైనప్పుడు భాజపాతో కలిసి పనిచేస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి' అని బిహార్‌లో పాదయాత్ర కొనసాగిస్తోన్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
భాజపాతో నీతీశ్ కుమార్ ఎప్పుడైనా కలిసిపోవచ్చని పీకే చేసిన వ్యాఖ్యలను జేడీయూ ఖండించింది. 'నీతీశ్ కుమార్ గత యాభై ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. పీకేకు మాత్రం ఆరు నెలలే అయ్యింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే పీకే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు' అంటూ జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంతవరకు భాజపాతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని నీతీశ్ కుమార్ ఇటీవల బహిరంగంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.