Nitish Kumar Controversial Comments :జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసలేం జరిగిందంటే?
'చదువుకున్న స్త్రీలు..'
బిహార్లో ఇటీవలే విడుదల చేసిన సమగ్ర కులగణన నివేదికపై సీఎం నీతీశ్ కుమార్ అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. "భర్తల చేష్టల కారణంగా మరిన్ని జననాలు సంభవిస్తున్నాయి. అయితే చదువుకున్న స్త్రీలు వాటిని కట్టడి చేస్తున్నారు. దాంతో జననాలు తగ్గుముఖం పడుతున్నాయి" అని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 4.3 శాతం ఉండగా.. గత ఏడాది అది 2.9కి పడిపోయిందని చెప్పారు. ఈ విషయం జర్నలిస్టులతో సహా సభలోని మిగతావారికీ తెలుసని.. త్వరలో సంతానోత్పత్తి రేటు 2కు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు'
నీతీశ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అవి అసభ్యంగా, పురుషాధిక్య ధోరణిని చాటేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని మహిళలను సీఎం అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు. నీతీశ్ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే విమర్శించారు. "అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనపడుతోంది. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, వైద్యుడిని సంప్రదించాలి" అని పేర్కొన్నారు.