రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ఉత్తర భారతంలో జరిగే పరిణామాలను అస్సలు ఊహించలేం. రోజుల వ్యవధిలో పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకు తాజా, ప్రత్యక్ష ఉదాహరణ.. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ). ఈ పార్టీలో పరిస్థితులు ఎంతలా మారిపోయాయంటే.. ఏకంగా ఎల్జేపీ(LJP) అధ్యక్షుడే ఏకాకిగా మారిపోయారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్(Chirag Paswan)ను దూరం పెట్టేశారు.
లోక్‌సభలో ఎల్జేపీకి ఆరుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అందులో ఐదుగురు ఎంపీలు.. చిరాగ్ పాసవాన్ స్థానంలో ఆయన బాబాయ్, ఎంపీ పశుపతి కుమార్ పరాస్(Pasupati Kumar Paras)ను తమ సభాపక్ష నేతగా ఎంచుకున్నారు. తమ నిర్ణయాన్ని గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు అభ్యర్థన పెట్టుకున్నారు. ఈ పరిణామాలు బిహార్ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారాయి.
బాబాయ్ అయినా..
ఎల్జేపీ వ్యవస్థాపకులు రాంవిలాస్ పాసవాన్ మరణించి సంవత్సరం కూడా కాక ముందే పార్టీలో ఈ పొరపొచ్చాలు రావడం గమనార్హం. చిరాగ్‌కు బాబాయ్ వరుసైన పశుపతి కుమార్ పరాస్.. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. చిరాగ్‌ను ఏకాకి చేసి మిగిలిన ఎంపీలందరినీ ఆయనకు వ్యతిరేకంగా జట్టుకట్టేలా చేశారు. చిరాగ్ సోదరుడు, ఎంపీ ప్రిన్స్ రాజ్ సైతం పశుపతి శిబిరంలోనే ఉండటం గమనార్హం.
ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి చిరాగ్ నేరుగా.. పశుపతి కుమార్ పరాస్ ఇంటికి వెళ్లినా ఫలితం దక్కలేదు.
మాస్టర్‌మైండ్ నితీశ్!
అయితే, ఈ పరిణామాలన్నింటి వెనక.. బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఉన్నారని ఊహాగానాలు విపిస్తున్నాయి. వేరుకుంపటి పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను ఎల్జేపీ దెబ్బతీసినందుకు నితీశ్ ప్రతికారం తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా భాజపాకు అధిక సీట్లు దక్కాయి కూడా! ఇప్పటికే.. ఎల్జేపీ టికెట్‌పై గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను గతంలోనే జేడీయూలోకి చేర్చుకున్నారు నితీశ్. అసెంబ్లీలో ఎల్జేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఇప్పుడు లోక్‌సభ సభ్యులపై ఆయన దృష్టిసారించారని విశ్లేషకులు చెబుతున్నారు.
సన్నిహితులను పురమాయించి..!
నితీశ్‌కు అత్యంత సన్నిహితుడైన లలన్ సింగ్.. ఎల్జేపీ రెబెల్ ఎంపీల్లో ఒకరైన వీణా దేవీ నివాసానికి వెళ్లడం సైతం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. దిల్లీలోని వీణా దేవి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి.. మరికొందరు ఎల్జేపీ నేతలు సైతం హాజరైనట్లు సమాచారం. ఎల్జేపీ నేతలు జేడీయూలోకి చేరాలని లలన్ సింగ్ కోరినట్లు తెలుస్తోంది. తనకు సన్నిహితులుగా ఉండే ఇతర నేతలను సైతం.. ఎల్జేపీ ఎంపీలతో మాట్లాడేందుకు నితీశ్ పురమాయించారు. వీటన్నింటిని బట్టి ఇదంతా తెరవెనక నుంచి నడిపిస్తోంది నితీశేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎంపీల బృందమంతా నితీశ్ వెంట వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
"ఎల్జేపీలో జరుగుతున్న పరిణామాల విషయంలో జేడీయూదే ప్రధాన పాత్ర. అందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ తమకు హాని చేయకుండా ఉండి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని జేడీయూ నేతలు పదేపదే చెబుతున్నారు. ఎల్జేపీ ప్రధాన నేతలంతా పశుపతి పరాస్‌ను కలుస్తున్నారు."