Nitin Gadkari News: ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్య అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇటీవలే భాజపా పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయిన గడ్కరీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం చర్చనీయాంశమైంది.
'మీకు అద్భుతాలు చేయగల సత్తా ఉంది. భారత మౌలిక సదుపాయాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందుకోసం మనం సాంకేతికత, కొత్త ఆలోచనలను అందిపుచ్చుకోవాలి. పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాణ్యతతో రాజీపడకుండా ఖర్చు తగ్గించే ప్రత్యామ్నాయ ముడిపదార్థాలను వినియోగించాలి. మొత్తంగా నిర్మాణానికి సమయం అనేది అత్యంత కీలకమైంది. అదే అతి పెద్ద పెట్టుబడి. అయితే ఇక్కడున్న అతి పెద్ద సమస్య.. సకాలంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడమే' అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు.
ఆదివారం అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ముంబయిలో ఏర్పాటు చేసిన NATCON-2022 సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఓ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని, మొత్తంగా ప్రభుత్వాల పనితీరును ప్రస్తావించారని భాజపా నేతలు అంటున్నారు.
ఇలా సూటిగా మాట్లాడే తత్వమే భాజపా పార్లమెంటరీ కమిటీలో చోటు కోల్పోయేందుకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కమిటీలో స్థానం దక్కని మరుక్షణమే.. అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీని ప్రశంసిస్తూ గడ్కరీ మాట్లాడారు. ఆ అగ్ర నేతల కృషి వల్లే భాజపా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. 1980లో భాజపా ముంబయిలో నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయీ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు.