తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచానికే భారత్​ దిక్సూచి.. ముందు వాటిపై దృష్టి పెట్టండి: మోదీ - cm kcr niti aayog

NITI Aayog Meeting: నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంటల్లో వైవిధ్యం కనబరచాలని, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల గురించి వివరించారు.

Niti Aayog meeting Prime Minister Narendra Modi asked states to focus on crop diversification
Niti Aayog meeting Prime Minister Narendra Modi asked states to focus on crop diversification

By

Published : Aug 7, 2022, 5:45 PM IST

Updated : Aug 7, 2022, 7:29 PM IST

NITI Aayog Meeting: పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. నూనె గింజలు (వంటనూనెలు) ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కొవిడ్​ సంక్షోభం సమయంలో.. భారత సహకార సమాఖ్యవాదం, సమాఖ్య నిర్మాణం ప్రపంచ దేశాలకే నమూనాగా నిలిచిందని.. నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశంలో అన్నారు ప్రధాని. దిల్లీ రాష్ట్రపతి భవన్​ సాంస్కృతిక కేంద్రంలో మోదీ అధ్యక్షతన జరిగిన భేటీకి పలువురు కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్​ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు హాజరయ్యారు.

నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్‌ను ఉద్ధేశించి మాట్లాడిన ప్రధాని.. సాంకేతిక వినియోగం ద్వారా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా భారత్ స్వయం సమృద్ధి సాధించి, వ్యవసాయ రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారాలని మోదీ ఆకాంక్షించారు. దేశంలో పెరుగుతున్న పట్టణీకరణను బలహీనతగా కాకుండా శక్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచటం, పారదర్శక సేవలను అందించడం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా పట్టణీకరణను శక్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 2023లో జరగబోయే.. జీ-20 సమావేశానికి భారత్ అధ్యక్షత వహించే అంశంపై మాట్లాడిన మోదీ ఈ సమావేశాల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు రాష్ట్రాలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

  • సమావేశం ఫలప్రదంగా జరిగిందని అన్నారు నీతి ఆయోగ్​ సీఈఓ పరమేశ్వరన్​ అయ్యర్​. ఎన్​ఈపీ 2020, జీ 20, ఎగుమతుల ప్రాధాన్యంపై చర్చ జరిగిందని అన్నారు.
  • కొవిడ్​ సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం గురించి మోదీ మాట్లాడారని వెల్లడించారు నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ సుమన్​ బేరీ. 2047 లక్ష్యాల గురించి ప్రధాని కీలకంగా మాట్లాడారని పేర్కొన్నారు.
  • నూతన విద్యావిధానంపైనా దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్​ సభ్యులు వీకే పాల్​. రాబోయే రోజుల్లో ఇది అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
  • పప్పు ధాన్యాల ఉత్పత్తిలో గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన పురోగతి సాధించినట్లు నీతి ఆయోగ్​ సభ్యుడు రమేశ్​ చంద్ వెల్లడించారు​.

2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్​ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవడం ఇదే తొలిసారి. ఈ మూడేళ్లు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీలు జరిగాయి. 2020లో కరోనా వైరస్​ నేపథ్యంలో నీతి ఆయోగ్​ సమావేశం కాలేదు. 2015 ఫిబ్రవరి 8న తొలి భేటీ జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్​ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్.. సమావేశాలను బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్​డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్​తో ఉపయోగం లేదని, నీతి ఆయోగ్​లో నీతి లేదని విమర్శించారు.

ఇవీ చూడండి:పరిశోధనలతోనే పురోగమనం... ప్రణాళికాబద్ధ ప్రస్థానం తక్షణావసరం!

నీతి ఆయోగ్‌ భేటీకి నితీశ్‌ గైర్హాజరు.. ఏంటి కథ?

Last Updated : Aug 7, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details