Niti aayog health index 2021: ఆరోగ్య విభాగం పనితీరులో కేరళ వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2019-20 ఏడాదికిగాను నీతి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో, ప్రపంచ బ్యాంకు సాంకేతిక సాయంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది నీతి ఆయోగ్.
తెలంగాణ మూడు, ఏపీ నాలుగో ర్యాంక్
ఈ జాబితాలో తమిళనాడు రెండోస్థానంలో నిలవగా.. తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్ నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచిన ఉత్తర్ప్రదేశ్ మరో విషయంలో మాత్రం అగ్రస్థానాన్ని ఆక్రమించుకోవటం విశేషం. 2018-19తో పోలిస్తే 2019-20 ఏడాదిలో ఉత్తర్ప్రదేశ్ ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.