Nithari Killings Case Accused Released :2006లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యలు, నరమాంస భక్షణ కేసుల నిందితుడు మోనిందర్ సింగ్ పంధేర్ జైలు నుంచి విడుదల అయ్యాడు. కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించలేదని అలహాబాద్ హైకోర్టు 3 రోజుల క్రితం పంధేర్, సహ నిందితుడు సురేందర్‌కోలిని నిర్దోషులుగా (Nithari Case Verdict) ప్రకటించింది. ఈ నేపథ్యంలో 65 ఏళ్ల మోనిందర్ సింగ్ పంధేర్ గ్రేటర్ నోయిడాలోని లుక్షర్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. అనంతరం పాత్రికేయులు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. పంధేర్ ఇంటి పనిమనిషి సురేందర్ కోలి ప్రస్తుతం దాస్నా జైలులో ఉన్నాడు.
ఇదీ కేసు..
Nithari Case Noida : ఉత్తర్ప్రదేశ్.. నొయిడా ప్రాంతంలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 వరుస హత్యలు జరిగాయి. అయితే 2006 డిసెంబర్లో స్థానిక వ్యాపారవేత్త అయిన మోనిందర్ సింగ్ పంధేర్ ఇంటి సమీపంలోని ఓ మురికి కాలువలో కొన్ని శరీర భాగాలు కనిపించాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. మోనిందర్ సింగ్ పంధేర్ ఇంటి వెనుక ఉన్న పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిగా కన్పించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
Nithari Case Details :ఆ తర్వాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటకు వచ్చాయి. మోనిందర్ సింగ్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ.. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి ఆహ్వానించేవాడని దర్యాప్తులో బయటపడింది. వారిని హత్య చేసి, మృతదేహాలపై నిందితులు లైంగిక దాడి చేశారని ప్రాథమికంగా నిర్ధరణ అయ్యింది. ఆ తర్వాత శరీర భాగాలను ఇంటి వెనుక భాగంలో విసిరేశారని సీబీఐ ఆరోపించింది. అంతే కాకుండా వీరునరమాంస భక్షకులనే ఆరోపణలు అప్పట్లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. దీంతో.. మోనిందర్ సింగ్ పంధేర్, సురేందర్ కోలీపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు పోలీసులు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా అందులో వీటిలో మూడింటిని మూసివేశారు.