Nirmala On IT Raids: ఇటీవల సంచలనంగా మారిన ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లో ఐటీ దాడులపై స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వేరే జైన్‌ను టార్గెట్ చేయాలనుకొని.. పీయూష్ జైన్‌పై ఆదాయపు పన్ను శాఖ పొరపాటున దాడి చేసిందంటూ విపక్షాలు, ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పక్కా సమాచారంతో సరైన వ్యక్తిపైనే సరైన అడ్రస్లోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారని ఆమె స్పష్టం చేశారు. పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంటి నుంచే అధికారులు రూ. 200 కోట్లు స్వాధీనం చేసుకున్నారని, అదేం భాజపా సొమ్ము కాదని పేర్కొన్నారు నిర్మల.
నిఘా వర్గాల సమాచారం మేరకే ఆ రోజు పన్ను ఎగవేత కేసులో ఐటీ దాడులు నిర్వహించిందని ఆమె వెల్లడించారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం.. కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. జైన్ ఇంట్లో బయటపడ్డ రూ.197.49 కోట్లు భాజపాకు చెందినవనే ఆరోపణల్ని విలేకరులు ప్రస్తావించగా.. అదేం లేదని సమాధానమిచ్చారు.
Nirmala Sitharaman on Akhilesh Yadav: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు స్నేహితుడు లేదా భాగస్వామి కావొచ్చని.. అందుకే అఖిలేశ్ వణికిపోయారని ఆరోపించారు నిర్మల. ఐటీ దాడుల వెనుక రాజకీయ ఒత్తిడి లేదని, అధికారులు ఏమన్నా ఖాళీ చేతులతో వచ్చారా? అని అన్నారు.
పీయూష్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎవరిదో అఖిలేశ్ ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. 'ఆ సొమ్ము ఎవరిదో మీకు ఎలా తెలుసు? మీరు అతడి భాగస్వామా? ఎవరి సొమ్ము దాచారన్నది భాగస్వాములకు మాత్రమే తెలుస్తుంది.' అని అఖిలేశ్‌కు చురకలు అంటించారు.
''ఆయన(సమాజ్‌వాదీ చీఫ్) సంస్థ వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించకూడదు. చట్టాన్ని రక్షించే సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయి. అధికారులు నిజాయితీగా పని చేశారనడానికి.. స్వాధీనం చేసుకున్న డబ్బే రుజువు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముహూర్తం చూసుకొని మేం దొంగను పట్టుకోవాలా? ఇప్పుడే ఆ పనిచేయాలా?''
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆరోగ్య మంత్రి
Piyush Jain Kanpur Raid
జీఎస్టీ ఎగవేత కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లోఅధికారులు డిసెంబర్ 24న తనిఖీలు నిర్వహించారు. కన్నౌజ్‌లోని ఆడ్కెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి.. ఇప్పటివరకు తాము రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు.