Nirmal Politics Telangana Assembly Election 2023 : నిర్మల్ నియోజకవర్గంలో 2.47లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గతానికంటే భిన్నంగా పరిస్థితి ఉంది. ఈ దఫా ఓటరునాడీ(Electoral Idea) తెలుసుకోవడం నేతలకు కష్టంగానే కనిపిస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, హస్తం అభ్యర్థిగా సీనియర్ నేత కూచాడి శ్రీహరిరావు తలపడుతున్నారు. ఓటర్లు పైకి జై కొడుతున్నప్పటికీ... చివరి క్షణంలో ఏమి చేస్తారనే అంతర్మథనం.. అభ్యర్థుల్లో గూడుకట్టుకుంటోంది.
ముక్కోణపు పోటీలో నెగ్గేదెవరు..?
వరి, పసుపు, సోయా, పత్తి పంట సాగుతోపాటు గొలుసుకట్టు చెరువులు, కొయ్యబొమ్మలకు నిర్మల్ ప్రసిద్ది పొందింది. గల్ఫ్, బీడీ కార్మికులూ ఎక్కువే ఉన్నారు. ఒకప్పుడు వందలాది మందికి ఉపాధి చూపించిన నటరాజ్ మిల్లు.. కాలగర్భంలో కలిసిపోయింది. అటవీ సంపద, జల వనరులకు(Water Resources) కొదవలేకపోయినప్పటికీ... ప్రగతికి నోచుకోలేదనే ఆవేదన స్థానికుల్లో ఉంది. గత ఎన్నికల్లో వీటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు అవే అంశాలు ప్రజల అజెండాగా తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం
ఎవరినీ ఆశించకుండా నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి ఆలోచించే వ్యక్తులు కావాలి. కానీ బంధు ప్రీతి, బంధువులను.. కులం పేరిటి బలగం చూపే వ్యక్తులను, అణగారిన వారిని ఎదగకుండా చేసే వారు రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి మంచి నాయకుడును ఎన్నుకోవటం చాలా ముఖ్యం. కడుపులో ఆకలి పెట్టుకొని ముఖానికి రంగు పూసుకంటే కడుపు నిండదు కనుక నిర్మల్‌ను పారిశ్రామికంగా కానీ.. వ్యవసాయపరంగా అభివృద్ధి చేసే దిశగా తీసుకువెళ్లాలని మేము కోరుకుంటున్నాం.-స్థానికులు