తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2021, 7:29 PM IST

ETV Bharat / bharat

ఈ ఆలయం తెరిచి ఉండేది.. ఏడాదిలో 5 గంటలే!

దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి.. వాటిలో కొన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంటే.. మరికొన్నింటిలో కొన్నినెలలే భగవంతుడి దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దేవాలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయట. మరి ఆ గుడి విశేషాలేంటో చూద్దాం.

Nirai Mata Mandir
నీరయ్‌ మాతా దేవాలయం

భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. దేవుడు వెలిసిన విధానంతో కావొచ్చు.. ఆలయ అద్భుత నిర్మాణంతో కావొచ్చు.. పుణ్యక్షేత్రాలుగా వేటి ప్రత్యేకత వాటిదే. కొన్ని ఆలయాల్లోకి ఏడాది పొడవునా భక్తులకు అనుమతిస్తే.. శబరిమల, ఛార్‌ధామ్‌ వంటి పుణ్యక్షేత్రాలకు ఏడాదిలో నెల, రెండు నెలల చొప్పున భగవంతుడి దర్శన భాగ్యం కల్పిస్తారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దేవాలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదా! మరి ఆ ఆలయం సంగతులేంటో తెలుసుకుందామా..!

మనం చెప్పుకుంటున్నది.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న నీరయ్‌ మాతా దేవాలయం గురించి. ఈ ఆలయంలోని నీరయ్‌ మాతా కేవలం ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తుంది. అందుకే, ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. అయితే, ఇక్కడ పూజా విధానమంతా వేరుగా ఉంటుంది. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ కొట్టి.. అగరబత్తులు వెలిగిస్తే చాలు మాతకు పూజలు చేసినట్లే. ఆ ఐదు గంటలు దాటిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించరు. తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. అంతేకాదు.. ఈ దేవాలయంలో పంచిన ప్రసాదాన్ని మహిళలు తినకూడదట. తింటే చెడు జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం.

దీపం దానికదే వెలుగుతుందట!

చైత్ర నవరాత్రుల ప్రారంభంలో నీరయ్‌ మాతా ఆలయంలోని దీపం దానంతట అదే వెలుగుతుందట. నూనె లేకున్నా.. తొమ్మిది రోజులపాటు దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. దీని వెనుకన్న రహస్యాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు.

ఇదీ చూడండి:మాస్కులు, కరోనా కిట్లతో బాబా ఆలయ అలంకరణ

ABOUT THE AUTHOR

...view details