Kerala Govt Measures On Nipah Virus Spread :కేరళలో నిఫా వైరస్ మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2018లో తొలిసారిగా వెలుగు చూసిన ఈ మహమ్మారి 17మందిని బలితీసుకోగా.. ఈసారి ఆ సంఖ్య ఇద్దరికి పరిమితమయ్యింది. నిఫా వైరస్ సోకినవారు మరణించే ప్రమాదం ఎక్కువని భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించటం వల్ల కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టడి చర్యలను కట్టుదిట్టం చేసింది.
ఆ జిల్లాలో మూడోసారి!
ప్రపంచదేశాలను హడలెత్తించిన కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్న కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అప్పటి కేరళ ఆరోగ్య శాఖ మంత్రిని ఐరాసలో సన్మానించటమే అందుకు నిదర్శనం. ఆ అనుభవంతోనే నిఫా వైరస్‌ను కూడా విజయన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. కేరళలో నిఫా వైరస్ బాధితుల సంఖ్య 6కు పెరిగింది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. 4 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. నిఫా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కొయ్‌కోడ్ జిల్లాలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి, వైరస్ సోకిన వ్యక్తులను కలిసినవారిని వెంటనే గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నిఫా బాధితులను వేరేచోటికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిఫా వైరస్ కేసులు కొయ్‌కోడ్ జిల్లాలోనే ఎక్కువగా నమోదు కావడానికి గల కారణాలు వైద్య నిపుణులకూ అంతుబట్టడం లేదు. 2018 తర్వాత కొయ్‌కోడ్‌లో నిఫా కేసులు బయటపడటం ఇది మూడోసారి. ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన కేరళప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులకూ అవగాహన తరగతులు నిర్వహించింది. ఏ చిన్న అనుమానం వచ్చినా నిఫా నిర్ధారణ పరీక్షలు చేయడంసహా ఫలితం తేలేవరకు ఐసోలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది.